కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గోదావరి ఖని,ఇట్స్ ట్రూ న్యూస్:
ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం కార్పొరేషన్ పారిశుధ్య మహిళా కార్మికులకు, అంగన్వాడీ టీచర్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 100 రోజుల అక్టీవిటీస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు కల్పిస్తున్న పథకాలు, వాటిని పొందాల్సిన పద్దతులను వివరించారు. కేంద్రప్రభుత్వ పథకాలైన భేటీ బచావో, భేటీ పడావో పథకం ద్వారా ఆడపిల్లల భద్రత, సంరక్షణ పట్ల అవగాహన కల్పించారు. సఖి కేంద్రాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో మహిళా హెల్ప్ లైన్ నంబర్ 181 కు కాల్ చేయాలనీ, ఛైల్డ్ కేర్ కోసం 1098 కు కాల్ చేసి ప్రయోజనాలను పొందాలని సూచించారు. ఆడపిల్లల పట్ల వివక్షత చూపించ కూడదని,మహిళలు ఆడపిల్లల చదువు పట్ల కూడా ప్రత్యేక శ్రద్ద వహించాలని అందుకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవ్వరైనా సైబర్ క్రైమ్ కు గురైనప్పుడు 1930 కి వెంటనే కాల్ చేసి మీ డబ్బును సురక్షితంగా తిరిగి పొందే అవకాశం ఉంటుందని సూచించారు. మహిళలు ఏదైనా ఆకతాయిల వేధింపులకు గురైతే 63039 23700 కి కాల్ చేసి షీ టీమ్స్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తోపాటు పెద్దపల్లి జిల్లా మహిళా సాధికారిత కేంద్రం కో ఆర్డినేటర్ దయా అరుణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మహిళలకు ఎన్నో పథకాలను కల్పిస్తున్నాయని వాటిపై మహిళల్లో అవగాహన లేకపోవడం మూలంగా పొందలేకపోతున్నారని తెలిపారు. మహిళల్లో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించేలా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలు మీకు చేరవేయడంలో తాను భాద్యత తీసుకుంటానని , కానీ రామగుండం కార్పొరేషన్ ను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు భాద్యతగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. పారిశుధ్య కార్మికులు సమయపాలన పాటించడం లేదని ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు డ్యూటీకి రావాలని ఆర్డర్ వేశారు. జీతాలపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటె తాను ఇప్పిస్తానని , పని మాత్రం ఖచ్చితంగా చేయాలన్నారు లేదంటే పరిణామాలు మరోలా ఉంటాయని ఓ వైపు అభ్యర్థిస్తూనే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రావూప్ ఖాన్, కార్పొరేషన్ కమీషనర్ శ్రీకాంత్, షీ టీమ్ SI రాజేంద్రప్రసాద్, డిస్ట్రిక్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎం.శ్రీనివాస్, CDPO స్వరూపరాణి, జెండర్ స్పెషలిస్ట్ చంద్రు స్వప్న, ఫైనాన్స్ లిటరసీ ఎస్. సంధ్యారాణి, పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.